బయటికొస్తున్న మారుతీరావు ఆస్తుల చిట్టా..
నల్లగొండ: మారుతీరావు ఆస్తుల చిట్టా బయటికొస్తోంది. మార్కెట్ విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.200 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదట మారుతీరావు కిరోసిన్ డీలర్ వ్యాపారం చేశాడు. తర్వాత రైస్ మిల్లుల బిజినెస్.. అనంతరం వాటిని అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వంద విల్లాలు విక్రయించారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఐదు ఫ్లాట్స్.. మిర్యాలగూడలో ఓ షాపింగ్ మాల్, ఈదులగూడెంలో మరో షాపింగ్ మాల్ ఉన్నాయి.
మారుతీరావు పేరు మీద రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. మిర్యాలగూడ బైపాస్‌లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి.. మిర్యాలగూడలో సర్వే నెం.457లో 7 కుంటల భూమి.. దామరచర్లలో 20 ఎకరాల పట్టా భూమి.. బంధమ్, తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్, బంగారు గడ్డలో ప్లాట్స్.. మారుతీరావు పేరు మీద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్ ఉన్నాయి.
హైదరాబాద్ వచ్చే ముందు భార్య గిరిజతో మారుతిరావు చెప్పిన మాటలివి..!
ఆత్మహత్యతో ముగిసిన మారుతిరావు శకం
మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతి రావు(59) శనివారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకోగా, ఆదివారం వెలుగు చూసింది. కూతురుపై ప్రేమతో చేతికి రక్తపు మరకలు అంటించుకున్న ఆయన బలవన్మరణం చర్చనీయాంశమైంది. కోర్టు పని ఉందంటూ హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు భార్య గిరిజతో చెప్పిన ఆయన శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరాడు.
హైదరాబాద్‌కు చేరుకున్న మారుతిరావు ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్యభవనంలో 306 నెంబర్‌గల రూంను అద్దెకు తీసుకున్నాడు. రూం తీసుకున్న విషయాన్ని భార్యకు ఫోన్‌చేసి చివరిసారిగా చెప్పాడు. కారు డ్రైవర్‌తో గారెలు తెప్పించుకున్న మారుతిరావు గది తలుపులు బిగించుకున్నాడు. ఆ తరువాత భార్య గిరిజ శనివారం సాయంత్రం ఫోన్‌చేయగా, ఎంతకూ ఎత్తకపోవడంతో, కారు డ్రైవర్‌కు ఫోన్ చేసింది. అతడు రూం వద్దకు వెళ్లి పిలిచినా పలకపోవడంతో అనుమానించిన భార్య గిరిజ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు ఖైరతాబాద్ పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు ఆర్యవైశ్యభవనం వద్దకు చేరుకొని గది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో తలుపులు పగులగొట్టి బెడ్‌రూంను పరిశీలించగా, మారుతీరావు విగతజీవిగా పడివున్నాడు. బెడ్‌పక్కన పడివున్న గారెల్లో విషం (పురుగుల మందు) కలిపి ఉన్నట్లుగా గుర్తించి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించుకున్న పోలీసులు మారుతిరావు భార్య గిరిజకు ఫోన్‌చేసి సమాచారమిచ్చారు.
దీంతో ఆమె తన మరిది శ్రవణ్‌కుమార్‌ను వెంటబెట్టుకొని ఆదివారం ఉదయం మిర్యాలగూడ నుంచి కారులో సంఘటన స్థలికి చేరారు. మారుతిరావుకు సంబంధించిన సూట్‌కేసును సీజ్‌చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం మిర్యాలగూడకు మారుతిరావు మృతదేహాన్ని తీసుకురాగా, సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆస్తులు భారీగా ఉన్నా ఎవరూ కొనేందుకు ముందుకు రాక.. రూ.50 వేల కోసం..
మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలు?
నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మారుతీరావు ఆత్మహత్యకు ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలని సమీప మిత్రులు, బంధువులు చెబుతున్నారు. మిర్యాలగూడ పట్టణ సమీపంలోని ఈదులగూడెంలో వ్యాపార సముదాయాన్ని విక్రయించగా, తన సోదరుడికి సైతం ఆ ఆస్తిలో వాటా ఉండటం, సంబంధిత నగదు సోదరుడి వద్దకే చేరడం, బ్యాంకు నుంచి నోటీసులు తదితర కారణాలతో ఆర్థిక ఇబ్బందులు పెరిగినట్లు సమీప మిత్రుల ద్వారా తెలిసింది. అమృత ప్రేమ వివాహం, ప్రణయ్ హత్య నేపథ్యంలో మారుతిరావు దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. మానసిక ఒత్తిడిని జయించేందుకు మారుతిరావు హైదరాబాద్‌లో చికిత్స సైతం తీసుకుంటున్నారు.
ఇటీవల మానసిక ఒత్తిడి తీవ్రమవడంతో వైద్యుడిని సంప్రదించగా, ఆయన అందుబాటులో లేకపోవడం, మందులు అయిపోవడం, మరోవైపు ప్రణయ్ హత్య కేసు విచారణకు రావడం, న్యాయవాదిని మాట్లాడుకునే ప్రయత్నంలో హైదరాబాద్‌కు తిరగడం ఇదిలా ఉంటే ఆర్థికంగా ఖర్చుల కోసం చేతిలో డబ్బులు లేకపోవడం మారుతిరావుకు ప్రధాన ఇబ్బందిగా మారింది. ఆయన పేరిట ఆస్తులు భారీగా ఉన్నా వాటిని విక్రయిస్తే కొనేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు.
రూ.50 వేల కోసం తాను ఇబ్బంది పడుతున్నానని, పలువురు మిత్రులతో ఆయన తన బాధను వ్యక్తం చేశారు. కాగా, మారుతిరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. ఆయన అంత్యక్రియలకు కూతురు అమృత దూరంగానే ఉండనుంది. అయితే ఆయన అంత్యక్రియలను భార్య గిరిజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమృత ఇంటికి ఐదుగురు సిబ్బందితో పోలీసులు పూర్తిగా బందోబస్తు కల్పించారు.
ఆదివారం ఉదయాన్నే 8 గంటలకు మనమే అతడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి...
న్యాయవాది కోసమే హైదరాబాద్‌కు...
నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రణయ్ కేసు నుంచి బయటపడేందుకు న్యాయవాదిని కలిసేందుకు మారుతిరావు హైదరాబాద్ వెళ్లినట్టు తెలిసింది. ప్రణయ్ హత్య కేసులో గత నెల చివరి వారంలో చార్జిషీట్ దాఖలు చేయగా, ఈనెల 3న దానికి సంబంధించిన నోటీసులు మారుతిరావుకు అందడంతో కేసు నుంచి బయటపడేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. మిర్యాలగూడలో న్యాయవాదులు చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం, కేసు నుంచి బయటపడటం కష్టమని చెప్పడంతో మారుతిరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఉరిశిక్ష తప్పదని పలువురు న్యాయవాదులు వారి అభిప్రాయాలను తెలియజేయడంతో, ఇటీవల కోర్టులోనే న్యాయవాది ఎదుట విలపించగా ఓదార్చినట్లు సమాచారం.
స్థానిక న్యాయవాదులతో కాదని, హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాదులను సంప్రదించాలనే ఉద్దేశంతోనే శనివారం నగరానికి వెళ్లినట్టు తెలిసింది. శనివారం సాయంత్రం న్యాయవాదిని కలవాల్సి ఉందని, తానున్నచోటికే అతడు వస్తాడని మారుతిరావు డ్రైవర్‌తో చెప్పినట్లు తెలిసింది. శనివారం సాయంత్రానికి న్యాయవాది రాకపోవడంతో, ఆదివారం ఉదయాన్నే 8 గంటలకు మనమే అతడి వద్దకు వెళ్లాల్సి ఉంటుందని మారుతిరావు డ్రైవరుకు శనివారం రాత్రి సమాచారం ఇచ్చాడు.
ఇదొక భాగమైతే తన కుటుంబంలోని ఇతరులకు కూడా వివాహ సంబంధాలు కుదరడం లేదని, సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మారుతీ రావు సోదరుడు ఆరోపించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సోదరుల మధ్య ఆస్తుల పంపకంలో వివాదాలు తలెత్తాయి. వడ్డీ సకాలంలో చెల్లించకపోవడంతో ఎస్‌ఎఫ్‌సీ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో మారుతిరావుకు మానసిక ఒత్తిడి తీవ్రమైనట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు మారుతిరావు వినియోగించిన విష పదార్థానికి సంబంధించిన బాటిల్‌ను తాను ఉన్న మూడో ఫ్లోర్ నుంచి బయటికి విసిరేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
నాడు అన్న... నేడు తమ్ముడు
మిర్యాలగూడ టౌన్: హైదరాబాద్‌లో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న తిరునగరు మారుతిరావు సోదరుడు తిరునగరు నాగేందర్ కూడా 1987లో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడలోని ఓ ప్రైవేటు లాడ్జిలో నాగేందర్ ఆత్మహత్య చేసుకోగా, 33 ఏళ్ల అనంతరం ఆయన తమ్ముడైన మారుతిరావు ఆత్మహత్యకు పాల్పడడంతో బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మృతిచెందిన ప్రాంతాలు వేరే అయినప్పటికీ ఇద్దరూ సొంతూరుకు దూరంగా లాడ్జిల్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇరువురి మరణాలకు కారణాలేవైనప్పటికీ ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములు అకాల మరణం చెందడం బాధ కలిగించిందని సమీప బంధువులు తెలిపారు. సివిల్ సప్లై సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసిన నాగేందర్ మృతి పట్ట నాడు అనుమానాలు వ్యక్తం కాగా, పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించినట్లు ఆయన బంధువులు తెలిపారు.
No comments:
Post a Comment