చెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి .. ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి
త్రుటిలో తప్పించుకొన్న కుమారుడు రయీస్
మద్యానికి బానిసై.. భార్య డబ్బివ్వడం లేదనే కోపంతో దారుణం
బాన్సువాడలో ఘోరంచెరువులో ముంచి.. కాళ్లతో తొక్కి ..
ముగ్గురు కూతుళ్లను చంపేసిన తండ్రి
బాన్సువాడలో ఘోరం
బాన్సువాడ టౌన్, మార్చి 6: ‘తెలిసినవాళ్లు దర్గా దగ్గర పండుగ చేస్తున్నరు.. పోయి తినొద్దం’ అని తండ్రి చెబితే ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఆనందంగా అతడి వెంట బయలుదేరారు. మంచి భోజనం పెట్టిస్తానని ఆశపెట్టిన ఆ తండ్రి.. కొద్ది దూరం వెళ్లగానే పిల్లలను ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. అలా కొట్టుకుంటూనే వారిని చెరువుగట్టు వైపు లాక్కెళ్లాడు. ముగ్గురు కుమార్తెలను బలవంతంగా చెరువు లోపలికి దించి నీళ్లలో ముంచాడు. పాపం పిల్లలు.. ఊపిరాడక తలలు పైకెత్తి, మమ్మల్ని చంపొద్దు అబ్బాజాన్ అని వేడుకున్నా ఆ కర్కోటకుడి హృదయం కరగలేదు. ముగ్గురినీ పదే పదే తన కాలితో లోపలికి తొక్కి చంపాడు. ఆ తండ్రి ఉన్మాదం నుంచి కుమారుడు త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం ఈ ఘోరం చోటు చేసుకుంది. తాగుడుకు బానిసై, భార్య డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ఇంతటి దారుణానికి ఒడగట్టాడు. బాన్సువాడ డీఎస్పీ దామోదర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్‌కు చెందిన సయ్యద్ ఫయాజ్ హుస్సేన్‌కు తాడ్కోల్ డ్రైవర్స్ కాలనీకి చెందిన నిలోఫర్ బేగంతో 2009లో పెళ్లయింది. డ్రైవర్స్ కాలనీలో అత్తమామలే ఫయాజ్‌కు ఓ ఇల్లు కట్టించి ఇచ్చారు. ఫయాజ్, నిలోఫర్ దంపతులకు ఆఫియా బేగం(10), మాహీన్ బేగం(9), జోయా బేగం(7), రయీస్ పిల్లలు. ఫయాజ్ కూలికి వెళుతుండగా, నీలోఫర్ టైలర్ పని చేస్తోంది. కొంతకాలంగా ఫయాజ్ మద్యానికి బానిసయ్యాడు. పనికి వెళ్లడం మానేసి.. తాగుడుకు డబ్బులు ఇవ్వాలని భార్యను కొడుతున్నాడు. కొన్నాళ్లుగా డ్వాక్రా గ్రూపు డబ్బులు తనకు ఇవ్వాలని భార్యను వేధిస్తున్నాడు. గురువారం రాత్రి భార్యతో గొడవపడి అరుస్తూ ఇంటి చుట్టూ ఉన్న మొక్కలను పీకేసి భయోత్పాతం సృష్టించాడు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు నలుగురు పిల్లలను దగ్గరికి తీసుకున్నాడు.
తెలిసినవాళ్లు కందూరు చేస్తున్నారని, వెళ్లి భోజనం చేసి వద్దామని నమ్మించి వారిని వెంట బెట్టుకొని తాడ్కోల్ గ్రామ చెరువు వైపు తీసుకెళ్లాడు. దారి మధ్యలో తండ్రి కొడుతుండటంతో రయూస్ తప్పించుకొని ఇంటికి వచ్చి తల్లికి చెప్పాడు. ఆమె పరుగెత్తుకొని వెళ్లి చూడగా చెరువు గట్టుపై కూతుళ్ల చెప్పులు కనిపించాయి. బిగ్గరగా రోదిస్తూ పక్కన పొలాల్లో పని చేస్తున్నవారిని పిలిచి తన కూతుళ్లను కాపాడాలని ఆమె వేడుకుంది. వారు చెరువులోకి దిగి గాలించగా ముగ్గురు పిల్లల మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులొచ్చి ఘటనపై ఆరా తీశారు. గ్రామంలోని కల్లు కాంపాండ్ వద్ద నిందితుడు ఫయాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లి నిలోఫర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫయాజ్‌ను కఠినంగా శిక్షించాలంటూ నిలోఫర్ బంధువులు, బాన్సువాడ పోలీ్‌సస్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
No comments:
Post a Comment