Friday, June 25, 2021

ఆంధ్రప్రదేశ్‌కు అస్తిత్వ స్పృహ ఉందా?

 ఆంధ్రప్రదేశ్‌కు అస్తిత్వ స్పృహ ఉందా?

Jun 26 2021

తెలంగాణ నుంచి విడివడిన ఆంధ్రదేశం తనదైన చరిత్ర నిర్మాణానికి ఇంతవరకూ పూనుకోనే లేదు. ఆంధ్రదేశంలో చరిత్రకారులకు కొదువ లేదు. ఇక్కడ జరుగుతున్న చరిత్ర పరిశోధన తక్కువేమీ కాదు. అయితే చరిత్రను వారంతా mega narrative గానే చూస్తున్నట్టున్నారు. చూస్తే చూడవచ్చునేమో గానీ విభజన జరిగి ఒక విభాగంలో అస్తిత్వ స్పృహ పెరిగినపుడు రెండవ విభాగం ఇంకా ఐక్యస్పృహలోనే కొనసాగడం ఆత్మహత్యాసదృశం అవుతుంది.

తెలంగాణకు ఉన్నట్లే కోస్తాంధ్రకు కూడా ప్రత్యేక అస్తిత్వం ఉంటుందా? అని ఒక విమర్శక మిత్రుడు ఇటీవల జరిగిన ఒక జూం సమావేశంలో సందేహం లేవనెత్తారు. తప్పకుండా ఉంటుంది అని ప్రధాన వక్త నుంచి సమాధానం వచ్చింది. సమైక్యం అనే ఆదర్శంలో పడి వేరొకరి అస్తిత్వంతో తన అస్తిత్వాన్ని కలగలుపుకున్న ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణకు అంగీకరించడం ద్వారా తనను విడదీసుకుని తన ప్రత్యేకతను నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రజ్యోతిలోనే రాసిన వ్యాసాలలో కోస్తాంధ్రకు చెందిన ఈ వ్యాసరచయిత ప్రస్తావించాడు. కొంతకాలంగా ఉన్న దాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరాన్ని ఈ ప్రశ్న అనివార్యం చేసింది.

ఇతర సంస్కృతులనూ కలిపేసుకుని తన సంస్కృతిని అందరిదిగా చలామణి చేసిందనే విమర్శను ఎదుర్కొన్న ఒకానొక ఆధిపత్య సంస్కృతి నుంచి ఒకటో రెండో సంస్కృతులు విడిపోయినప్పుడు మిగిలేది ఆ సంస్కృతేనా, లేక వేరొకటా? వేరొక అస్తిత్వాన్ని గుర్తించక తన అస్తిత్వాన్నే ఇతరుల అస్తిత్వంగా మలచిన ఒకానొక అస్తిత్వంలో నుంచి ఇతర అస్తిత్వం వేరైపోయినపుడు మిగిలేది అదే అస్తిత్వమా? లేక, అది వేరొకటిగా మారుతుందా? అట్లా మారిపోయేటట్లయితే ఒకనాటి దాని అస్తిత్వం ఆధిపత్య అస్తిత్వం అవుతుందా? మారకపోతే ఒక అస్తిత్వాన్ని తన నుంచి కోల్పోయిన ప్రభావం ఏమీ లేనట్లేనా? అనే ప్రశ్నలకు తెలంగాణ నుంచి విడివడిన ఆంధ్రప్రదేశ్ నిస్సందేహంగా తనదైన కొత్త అస్తిత్వంతో మిగిలింది అనేది జవాబు. అయితే ఆ స్పృహను అది ఎంతమేరకు సంతరించుకుందీ అన్నది ఈ వ్యాస చర్చనీయాంశం.

ప్రాదేశిక అస్తిత్వానికి నిర్వచనం ఒక ప్రదేశంలో ఉంటూ ఒక చరిత్ర, భాష, సంస్కృతులు కలిగి ఉండి తమను ఇతరుల కంటే ప్రత్యేకంగా భావించుకుని ఆ ప్రత్యేకతలను నిలబెట్టుకోవడానికీ, అభివృద్ధి పరచుకోవడానికీ ప్రయత్నించడం. ఇందులో ప్రదేశం అత్యంత కీలకం. దానికి ఇతర ప్రాంతాల నుంచి విడివడే లక్షణం లేకుంటే మిగిలినవి సాధ్యపడవు. ఉదాహరణకు ఒకే లక్షణాలు కలిగిన ఒక మతానికో కులానికో రంగుకో చెందిన వాళ్లు వేర్వేరు ప్రదేశాల్లో పరచుకుని ఉంటే వారికిది సాధ్యం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తిత్వాన్ని కోల్పోయినట్టు భావిస్తున్న తెలంగాణ ఉద్యమించి వేరైనపుడు ఆంధ్రప్రదేశ్ భిన్నమైన ప్రాదేశిక అస్తిత్వంతో మిగిలింది. కాబట్టి అస్తిత్వ స్పృహ కలగడానికీ పెరగడానికీ కావలసిన మొదటి ప్రాతిపదిక సమకూరింది. పరిధి చిన్నదై లక్ష్యాలు నిర్దిష్టమయ్యాయి.

అయితే ఆంధ్రప్రదేశ్ అనే పేరు కొనసాగడంతో దానికి రెండు అస్తిత్వాలు ఏర్పడినట్లయింది. ఒకటి తెలంగాణతో కలసి ఉన్నప్పటిదీ, రెండవది విడివడినప్పటిది. అందువల్ల తెలంగాణ విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్, పాతదా, కొత్తదా అనే ప్రశ్న ఎదురవుతుంది. పాతది అంటే పేరు పాతది, అస్తిత్వమూ పాతదే అనే భావనలో ఉండడం. కొత్తది అనుకోవడంలో రెండు రకాలుంటాయి. ఒకటి పేరు పాతదైనా అస్తిత్వం కొత్తది అనుకోవడం. రెండవది అస్తిత్వం కొత్తదైనపుడు పేరూ కొత్తదే ఉండాలని కోరుకోవడం. ఆంధ్రప్రదేశ్ తనకు కొత్తపేరు కావాలని కోరుకోకపోవడం వెనుక తన అస్తిత్వం కూడా పాతదే అనే భావన ఉన్నట్లుంది. తెలంగాణ కొత్త అస్తిత్వంతో, ఆ అస్తిత్వంతో అవిభాజ్యమైన పేరుతో ఒక తాజాదనంతో అడుగులు వేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ తానొక కొత్త అస్తిత్వాన్ని సంతరించుకున్నానన్న స్పృహని చైతన్యాన్నీ తగినంత పొందలేకపోతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త అస్తిత్వ స్పృహను పొందడానికి బహుశ కొత్తపేరు అవసరం అవుతుంది. 

అంత్యము నందు అచ్చు ఉండే అజంత భాష అయిన తెలుగు మాతృభాషగా కలిగిన రాష్ట్రానికి చివర హల్లు ఉన్న ‘ప్రదేశ్’ అనే పేరు ఏమిటీ? ఆంధ్రము వంటి వాడుకలో లేని పదం కంటే ‘తెలుగు’ అనే మాట ఉత్తమం కదా! తెలుగు అనే భాషా సూచకానికి చారిత్రక ప్రాధాన్యమున్న ‘నాడు’ను కలిపి చేసే ‘తెలుగునాడు’ అటువంటి ఒక కొత్త పేరు. తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు ఒక పేరులో తెలుగు, మరొక పేరులో తెలంగు ఉండడంలోని సారూప్యత మౌలికంగా ఉన్న ఏకతకు చిహ్నం కూడా అవుతుంది. అది కాకపోతే ఆంధ్ర అస్తిత్వ ప్రత్యేకతను సూచించే మరో పేరైనా ఎంపిక చేయవచ్చు. ఫలితం కొత్త అస్తిత్వ స్పృహ!

భిన్నమైన చరిత్ర ఉండడం అస్తిత్వ ముఖ్యలక్షణాల్లో ఒకటి. తెలంగాణ నుంచి విడివడిన ఆంధ్రదేశం తనదైన చరిత్ర నిర్మాణానికి ఇంతవరకూ పూనుకోనే లేదు. ఆంధ్రదేశంలో చరిత్రకారులకు కొదువ లేదు. ఇక్కడ జరుగుతున్న చరిత్ర పరిశోధన తక్కువేమీ కాదు. అయితే చరిత్రను వారంతా mega narrative గానే చూస్తున్నట్టున్నారు. చూస్తే చూడవచ్చునేమో గానీ విభజన జరిగి ఒక విభాగంలో అస్తిత్వ స్పృహ పెరిగినపుడు రెండవ విభాగం ఇంకా ఐక్యస్పృహలోనే కొనసాగడం ఆత్మహత్యాసదృశం అవుతుంది. కొత్తగా జరగవలసిన పరిశోధనలో ఆంధ్రదేశానికి చెందిన నిర్దిష్టత ఏదో వెలికి రావలసి ఉంది. చరిత్ర పూర్వయుగ సంస్కృతుల దగ్గర మొదలుపెట్టి ఆధునికయుగం దాకా ఆంధ్రదేశ చరిత్రను వేరు చెయ్యాలి. ముఖ్యంగా ఆంధ్రదేశం నుంచి తెలంగాణకు సాగిన ఆధునిక యుగ వలసల ఆర్థికనేపథ్యం, చారిత్రక అనివార్యత, దాని పర్యవసానాల మీద సంశ్లేషణాత్మకమైన పరిశోధన జరగవలసి ఉంది. ఒక ప్రాంతం మీద మరొక ప్రాంతం చేసిన ఆర్థిక పెత్తనం వెనుక ఉన్న వ్యక్తుల్నీ ప్రాంతాన్నీ కాక చరిత్ర చోదకశక్తుల్ని వెలికి తీయవలసి ఉంది. ఆంధ్రదేశ చరిత్రకారులు అందుకు ఉత్తరాధునికం వంటి సరికొత్త దృక్పథాల్ని సంతరించుకుంటారా లేక పాత పద్ధతుల్లోనే కొత్త దారులు వెతుకుతారా అన్నది ఆసక్తికరం.

ఏ భాష సంస్కృతికైనా ఏ కాలంలోనైనా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. అయితే, అసలు ఆంధ్రదేశ ప్రజలకు తమ భాషాసంస్కృతుల మీద ఎంత గౌరవం ఎంత ఇష్టం ఉన్నాయి? అవి సంప్రదాయాన్ని అభిమానించడంతో పాటు ఎంత ఆధునికతను సంతరించుకుంటున్నాయి? ఈ ఇష్ట గౌరవాల్లో సారమెంత, నీరమెంత? అన్నవి చాలాకాలంగా చాలామంది వేస్తున్న ప్రశ్నలు. ఒకటి మాత్రం నిజం ఆంధ్రదేశంలో భాషా సంస్కృతుల్ని నిలబెట్టుకోవడం అనేది దాన్ని అధ్యయనం చేసిన, లేదా అభిమానం పెంచుకున్న ప్రత్యేకవర్గానికి చెందినదిగా భావించడం ఉంది. రాజకీయ పార్టీలు, పారిశ్రామిక వర్గాలు, స్వచ్చందసంస్థలు, మేధావివర్గాలు అది తమ పని కాదని భావిస్తాయి. వీళ్లల్లోనే కొందరు అది తక్కువస్థాయి కార్యక్రమం అని కూడా అనుకుంటారు. మరి కొందరు వాటిని నిలబెట్టడానికి ఆర్థిక సహాయం చెయ్యడం ద్వారా వాటి పరిరక్షకులుగా ఖ్యాతి పొందజూస్తారు, కానీ పాటించరు. మొత్తం మీద ఈ విషయంలో వాగర్థాలు రెండూ తక్కువే. ‘నీ సంస్కృతీ లక్షణాలు ఏమిటీ’ అని ఆంధ్రుడిని ఎవరైనా నిలదీస్తే చెప్పగలిగే వాళ్లు లేరు అనేంత తక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక విభాగం దగ్గర అది పరిరక్షించబూనుకున్న రాష్ట్ర సంస్కృతి మౌలిక లక్షణాలనదగ్గవి ఏమైనా ఉన్నాయేమో తెలీదు. సంస్కృతి అంటే గ్రామీణ లేదా గిరిజన కళలు అనే భ్రమ మాత్రం ఉంది. తెలుగు వారి సంప్రదాయాలూ, మర్యాదలు, ఆహారం, వేషధారణ, అలంకరణ, పండుగలు, భాషా ప్రాంతీయ వైవిధ్యం మొదలైన వాటి సమ్మిశ్రమంగా అనుసరిస్తూ నిలుపుకోదగ్గ లక్షణాలను రూపొందించుకోవడం కదా అస్తిత్వమంటే? అది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా?! ఏ ప్రభుత్వమైనా ఆ స్పృహను తను సంతరించుకోవడం ద్వారా ప్రజలకు కలిగించిందా?

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకనాడు ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చింది. ఒక మేరకు జాతీయ రాజకీయాలలో ముద్ర వేయగలిగింది కానీ తెలుగు వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని నిలబెట్టడానికి అది చేసిన కృషి ఏమీ లేదు, ట్యాంక్‌బండ్ మీద విగ్రహాల్ని నెలకొల్పడం తప్ప. సంబంధిత వ్యవస్థల్ని రద్దుచేసి పునర్వ్యవస్థీకరించుకున్న తెలుగు విశ్వవిద్యాలయం చేసిన కృషి ఏమైనా ఉంటే దాన్ని వ్యవస్థీకరించలేదు. ఎన్‌టి రామారావు కాలంలో వచ్చిన ‘తెలుగునాడు’ అనే కొత్త పేరు ప్రతిపాదనను కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదట అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం పునఃపరిశీలించలేదు. ఆంధ్రదేశానికి సాఫ్ట్‌వేర్ ప్రపంచ పటంలో చోటు కల్పించాలని పడిన ఆరాటంలో అది తనదైన అస్తిత్వంతో ఉండాలనే కీలకాంశాన్ని విస్మరించింది. ఫలితంగా ఆంధ్రదేశం సిలికాన్ ప్రపంచానికి ఉపగ్రహంగా మారిపోయింది. సాఫ్ట్‌వేర్ సంస్కృతి, దాని అనుబంధ జీవన విధానం వచ్చి చేరి మానవసంబంధాలే మారిపోయాయి. 

ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భాష సంస్కృతుల విధానమేమిటో ఇప్పటివరకు స్పష్టం కాలేదు. వాటి పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలియచేసే ఏ సూచనలూ లేవు. పైగా ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో ఇంగ్లీష్ మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో నిమ్నకులాలూ, పేదవర్గాలూ ఇంగ్లీషు మాధ్యమం తమ ఎదుగుదలకు ఆలంబనగా భావిస్తుంటే ఇతరవర్గాలు ఇది తెలుగు భాష నిర్వీర్యానికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నాయి. అస్తిత్వానికి తెలుగు, అభివృద్ధికి ఇంగ్లీషూ ప్రతీకలైనపుడు వీటి మధ్య తుల్యతను సాధించాల్సి ఉంది. మండలానికో తెలుగు పాఠశాల దీనికి పరిష్కారం కాదు. ఆంగ్ల మాధ్యమమే అంతిమ నిర్ణయమయ్యేటట్టయితే మొత్తం విద్యలో తెలుగు భాషతో పాటు సంస్కృతి సముచిత స్థానం పొందాలి.

ఏ అస్తిత్వ చైతన్యంతో అయితే నాలుగు దశాబ్దాల పాటు పోరాటం చేసి మద్రాసు నుంచి ఆంధ్రదేశం విడివడిందో ఆ చైతన్యమే ఇప్పుడు కూడా కావాలి. ఆంధ్రదేశానికి రెండు అనుభవాలు ఉన్నాయి. ఒకటి మద్రాసుతో కలిసి ఉన్నప్పటి ద్వితీయస్థాయి అనుభవం. రెండు తెలంగాణతో కలిసి ఉన్నప్పటి ఆధిపత్య అనుభవం. ఆంధ్రదేశం ఈ రెండూ కాదు. దానికొక కేవలత్వం ఉంది. అది కనిపించాలి. వినిపించాలి.

కొప్పర్తి వెంకటరమణమూర్తి