Thursday, June 16, 2022

సహజీవనంలోనే ఆ వెసులుబాటు

 published: Thu, 16 Jun 2022 01:44:13 ISTహోం నవ్యఓపెన్ పేజీ


సహజీవనంలోనే ఆ వెసులుబాటు


పురుషాధిక్యత పునాదిగా సాగే సంప్రదాయ పెళ్లికన్నా, ఎవరి హక్కులను వారు కాపాడుకుంటూ సాగే సహజీవనం గౌరవప్రదమైనది’’ అంటారు రచయిత్రి సుజాత వేల్పూరి. అయితే, పెళ్లికి సహజీవనం ప్రత్యామ్నాయం కాదంటారు ఆమె. సహజీవనం చట్టబద్ధమైందే అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో సుజాత తన అభిప్రాయాన్ని నవ్యతో పంచుకున్నారు.

‘‘సహజీవనాన్ని చట్టబద్ధమైన వివాహంగా పరిగణిస్తున్నట్టు ఒక తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేయడం సంతోషకరం. నిజానికి 2009లో ఒక కేసు విషయంలో సహజీవనంలోని మహిళను ఉంపుడుగత్తె (కాంక్యుబైన్‌) అన్న అర్థంలో దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆ మాటలు ప్రజాస్వామిక వాదులను, ముఖ్యంగా మహిళా హక్కుల రంగంలో పనిచేస్తున్న వారిని తీవ్రంగా కలచివేశాయి. అయితే, ఇప్పటి తీర్పులో సహజీవన బంధంలోని మహిళను భార్యగానే గుర్తిస్తున్నట్లు వెల్లడించడం అప్పటి వ్యాఖ్యలకు ఒక సవరణ అనుకుంటున్నా. సంప్రదాయ వివాహ వ్యవస్థలో అడుగడుగునా మగవాడి ఆధిపత్యమే కొనసాగుతుంది. యాభై లక్షల రూపాయలు కట్నం తీసుకొచ్చిన భార్యను కూడా రాత్రికి రాత్రి ‘నా ఇంట్లో నుంచి వెళు’్ల అనగలిగే గొంతును మగవాడికి పెళ్లి కల్పిస్తుంది. అదే సహజీవనం... ఎవరి హక్కులను వాళ్లు కాపాడుకుంటూ, అవతలి వ్యక్తి స్వేచ్ఛను గౌరవించుకోవడమనే ప్రాతిపదికన కొనసాగుతుంది. ఆ బంధంలో ఎవరిని ఎవరూ వెళ్లిపోమని ఆదేశించరు. ఒకవేళ విడిపోవాలనుకుంటే, విడాకులు వగైరా వంటివేవీ అక్కర్లేకుండా... స్వేచ్ఛగా ఎవరిదారి వాళ్లు చూసుకుంటారు. 

అవగాహనతో సాగే బంధాలు...సహజీవనంలోనూ రకరకాల ధోరణులుంటాయి. అందులో ఒకటి... మానసిక పరిణతి కలిగిన స్త్రీ, పురుషుల్దిరూ పరస్పర ప్రేమతో కలిసి జీవించడం ద్వారా ఒకే జీవితాన్ని పంచుకోవడం. వాళ్ల బంధంలో ప్రేమానురాగాలకు కొదవుండదు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో కలిసి ముందుకెళతారు. ఒకవేళ విడిపోవాలనుకున్నా, ఇద్దరూ ఒక అవగాహనతో ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు. అయితే, ఆకర్షణ, భావోద్వేగం పునాదిగా సాగే సహజీవనాలూ మన సమాజంలో లేకపోలేదు. అలాంటి వాటిల్లో ఆధిపత్యం, అవమానాలు, అనుమానాలు వంటివన్నీ పుష్కలంగా ఉండచ్చు. కొద్దిరోజులకే ఆ బంధం విషాదాంతం కావచ్చు. కనుక ఇక్కడ సహజీవనం అనగానే అన్నీ బంధాలనూ ఒక్కలా చూడలేం. ఆయా వ్యక్తుల ఆలోచనా స్థాయి ఆఽధారంగా ఇరువురి మధ్య బంధం కొనసాగుతుందని గుర్తించాలి. వివాహ వ్యవస్థ ప్రపంచమంతా అన్ని సంస్కృతుల్లోనూ వేళ్లూనుకొనున్న బలమైన వ్యవస్థ. అయినా, దాని లోపాలు దానికున్నాయి. సహజీవనం పాశ్చాత్య పోకడ అయినా, దాని సానుకూలతలు దానికున్నాయి. ఈ రెండిటిని పోల్చి చూడక, దేన్ని ఎంచుకున్నా సానుకూల దృక్పథంతో, అవగాహనతో, పరిణతితో ముందుకు సాగడం ముఖ్యం. ఏ బంధం పటిష్టంగా కొనసాగాలన్నా ఇరువురి మధ్య అవగాహన ముఖ్యం. ’’ 

ఆడవాళ్ల మీదే భారం... పెళ్లికి సహజీవనం పూర్తి ప్రత్యామ్నాయం కాదు. సహజీవనంలోనూ కొన్నాళ్లు గడిచాక, జీవిత భాగస్వామి మీద పెత్తనం చలాయిస్తూ పురుషాధిక్యతను చాటుకునే మగవాళ్లు బోలెడుమంది. ఒకవేళ పిల్లలుంటే, ఆ బాధ్యతను పూర్తిగా ఆడవాళ్లమీద వదిలేస్తున్న ఘటనలూ ఉన్నాయి. కలిసున్నప్పుడు గృహహింస తక్కువేమీ లేదు. అయితే, సహజీవన బంధంలోనూ హింసకు గురైన మహిళ గృహహింస నిరోధక చట్టాన్ని ఆశ్రయించవచ్చు. లివింగ్‌ రిలేషన్‌లో పుట్టిన పిల్లలకు అన్యాయం జరగకూడదు. వాళ్ల సంరక్షణ బాధ్యతను తండ్రి స్వీకరించాల్సిందే.! ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే.! అదే విషయాన్ని న్యాయస్థానాలు చెప్పడం మంచి పరిణామం.

No comments:

Post a Comment