Published: Wed, 01 Jun 2022 04:44:38 ISTహోంఎడిటోరియల్ఇండియాగేట్న్యాయాన్ని గెలిపించిన న్యాయమూర్తిtwitter-iconwatsapp-iconfb-iconన్యాయాన్ని గెలిపించిన న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్సం|| 93979 79750‘కొందరు వ్యక్తులు విద్వేష ప్రసంగాలకు పూనుకుని ప్రజల మధ్య ద్వేష భావాలను రెచ్చగొట్టడం గురించి తీవ్రంగా పరిగణించాలి. వారిపై చర్య తీసుకునేందుకు ఐపీసీలో అవసరమైన మార్పులు చేయాలి..’ అని ప్రముఖ న్యాయవేత్త సోలీ సోరాబ్జీ స్మారకోపన్యాసంలో ప్రకటించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు న్యాయవ్యవస్థలో తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతులైన న్యాయమూర్తుల్లో ఒకరు. గత ఆరు సంవత్సరాలుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు మరో వారం రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఎటువంటి ఆర్భాటం, పటాటోపం, ప్రచారాలు లేకుండానే దేశంలో ప్రజల జీవించే హక్కు, అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయమూర్తిగా జస్టిస్ నాగేశ్వరరావు తన వంతు కృషి చేశారనడంలో సందేహం లేదు.
‘స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అయిందని అంటున్నారు. అయితే నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా అన్నది అనుమానమే’ అని ఒక సందర్భంలో ప్రకటించిన జస్టిస్ నాగేశ్వరరావు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కు సూటిగా వ్యవహరించిన కొద్ది మంది న్యాయమూర్తుల్లో ఒకరు. ప్రజలు అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. ‘లక్షలాది పిల్లలు సరైన విద్య, ఆహారం లేకుండా రహదారులపై జీవిస్తున్నారు. వారి గురించి ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఇది దేశానికి మంచిది కాదు’ అని జస్టిస్ నాగేశ్వరరావు ఒక కేసులో ప్రశ్నించారు.
జస్టిస్ లావు నాగేశ్వరరావు దాదాపు మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కోర్టు, ఏపీ హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన అనేక కేసులతో వ్యవహరించారు. ఈ దేశంలో ఆయనను న్యాయవాదిగా నియమించుకోని రాజకీయ నాయకుడు అంటూ లేరు. జయలలిత, దయానిధి మారన్, లాలూ ప్రసాద్‌యాదవ్, నితీశ్ కుమార్ తో పాటు ఎందరో నేతలు ఆయన సేవలు అందుకున్నారు. సుప్రీంకోర్టులో తాను చూసిన ప్రతిభావంతుడైన న్యాయవాది లావు నాగేశ్వరరావు అని కేంద్ర న్యాయమంత్రిగా ఉన్న కీర్తిశేషుడు అరుణ్ జైట్లీ అనేక సందర్భాల్లో ప్రశంసించారు. ‘దుకాణాలు, కుర్చీలు, టేబుళ్లు తొలగించేందుకు మీకు బుల్‌డోజర్లు కావాలా?’ అని ఆయన ఇటీవల జహంగీర్ పురిలో మునిసిపల్ కార్పొరేషన్ బుల్‌డోజర్లతో స్వైర విహారం చేస్తుంటే ప్రశ్నించారు. తాము ఇళ్లు కూల్చడం లేదని కేవలం ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను మాత్రమే తొలగిస్తున్నామని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు ముందు పచ్చి అబద్దాలు చెబుతుంటే నిలదీసిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ఢిల్లీలో బుల్‌డోజర్ల సంస్కృతికి అడ్డుకట్ట వేశారు.
పర్యావరణ ఉల్లంఘనలు జరిగినా, ప్రజలకు రేషన్ కార్డులు రద్దు చేసినా, కొందరి విషయంలో ఏకపక్షంగా కేసులు మోపుతూ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినా, పరిమితిని మించి రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్లు ప్రకటించినా జస్టిస్ నాగేశ్వరరావు జోక్యం చేసుకుని కీలక తీర్పుల్ని వెలువరించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలు మూసివేయాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేస్తే తాము అడ్డుకోబోమని, వాటిని ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేయబోమని స్పష్టంచేశారు. ఒక మహిళా సెషన్స్ జడ్జి తనను ఒక హైకోర్టు న్యాయమూర్తి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసినప్పుడు ఆమెను తిరిగి నియమించేలా చూశారు. ముగ్గురు నిందితులకు మరణ శిక్షలు విధించడంలో క్రింది కోర్టు, హైకోర్టు తప్పులకు పాల్పడ్డప్పుడు జోక్యం చేసుకుని వారు విడుదలయ్యేలా చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మూడు దశాబ్దాలుగా జైళ్లో ఉన్న పెరారి వాలన్‌కు క్షమాభిక్ష పెట్టడంలో గవర్నర్ రెండేళ్ల పాటు ఆలస్యం చేయడంతో కలుగ చేసుకుని పెరారి వాలన్‌ను విడుదల చేశారు. గవర్నర్ తరఫున కేంద్రం సుప్రీంలో వాదించడానికి వచ్చినప్పుడు ‘మీకు గవర్నర్ నిర్ణయంతో ఏం పని?’ అని జస్టిస్ నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌లకు కాలదోషం పట్టిన తర్వాత మళ్లీ జారీ చేసినప్పుడు అది రాజ్యాంగంతో చెలగాటమాడటమే అని స్పష్టం చేశారు. మతం, జాతి, కులం, తెగ, భాష పేరుతో ఎన్నికల ప్రచారం చేయడం అవినీతితో సమానమేనని ఆయన ప్రకటించారు, ఎస్‌సి, ఎస్‌టిలకు, దివ్యాంగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు విషయంలో కీలక తీర్పులు వెలువరించారు. మెడికల్ కాలేజీల్లో భారీగా కాపిటేషన్ ఫీజులు వసూలు చేయడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు.
కొవిడ్ సమయంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రజలను ఆదుకున్న తీరు అంతా ఇంతా కాదు నిత్యావసర మందుల ధరలు, ఆక్సిజన్ రవాణా, వాక్సిన్ విధానంపై తనంతట తాను కేసుల్ని స్వీకరించారు. వాక్సిన్లకోసం రూ. 35వేల కోట్లు కేటాయించినప్పుడు వాటిని ఉచితంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు, దీనితో కేంద్రం తన వాక్సినేషన్ విధానాన్ని సమీక్షించుకోవాల్సివచ్చింది. కరోనా మహమ్మారి తొలి విడత సమయంలో బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల పరిస్థితి గురించి ఆయన తనంతట తాను కేసును విచారణకు స్వీకరించారు. కొవిడ్ సమయంలో అనాథలైన పిల్లల గురించి డేటా సేకరించాలని, వారి చదువు యథాతథంగా సాగేలా చూడాలని ఆదేశించారు. జైళ్లు ఖైదీలతో నిండిపోయిన రీత్యా, కరోనా సమయంలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేసే విషయం పరిశీలించాలని, పెరోల్‌పై బయట ఉన్న వారిని లొంగి పొమ్మని బలవంత పెట్టరాదని ఆదేశించారు. కరోనా సమయంలో బెయిల్ పిటిషన్ల దరఖాస్తులను స్వీకరించరాదని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన తీవ్రంగా అభ్యంతరం వెలిబుచ్చారు. ఇది నిందితుల రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని జస్టిస్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
షెల్టర్ హోమ్‌లలో వలస కూలీలకు నీరు, ఆహారం, మందులు, ఇతర సౌకర్యాలు అందేలా చూడాలని జస్టిస్ నాగేశ్వరరావు ఆదేశించారు. ‘భయాందోళనలు వ్యాప్తి చేయకుండా చూడండి. అవసరమైతే మత గురువులను ఉపయోగించుకోండి’ అని ఆదేశాలు జారీ చేశారు. కాన్పూరులోని ఒక షెల్టర్‌లో 57 మంది మైనర్ బాలికలకు కొవిడ్ వచ్చిందని వచ్చిన వార్తలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఆయన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా ఇటుక బట్టీల్లో కూలీలతో వెట్టి చాకిరి చేయడంపై ఆయన స్పందించి వారిని వెంటనే విడుదల చేసి పునరావాసం కల్పించాల్సిందిగా ఆదేశించారు. బస్టాండుల్లో కూలీలను వరుసగా కూర్చోబెట్టి వారిపై శానిటైజేషన్ పేరుతో స్ప్రేలు చల్లడంపై ఆయన ప్రభుత్వం నుంచి నివేదికలు కోరారు. కూలీలు మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లడంపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నదని ప్రశ్నించారు. ‘వలస కూలీలపట్ల మానవత్వంతో వ్యవహరించండి’ అని జస్టిస్ నాగేశ్వరరావు చెప్పారు. తాజాగా ఆయన సెక్స్ వర్కర్లకు కూడా సమాజంలో మర్యాదగా జీవించే హక్కు ఉంటుందని ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. వారికి, గుర్తింపు కార్డులు, అడ్రస్ లతో పని లేకుండా రేషన్ ఇవ్వాలని, ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారన్న దానితో ప్రమేయం లేకుండా గౌరవంగా జీవించే హక్కు పొందడం అనేది ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ‘స్వచ్ఛందంగా సెక్స్ పనిచేయడం అక్రమం కాదు. కాని వ్యభిచార గృహం నడపడం అక్రమం. మీడియాకు సెక్స్ వర్కర్ల పేర్లు వెల్లడించరాదు అని ఆయన స్పష్టం చేశారు. సెక్స్ వర్కర్లని అరెస్టు చేసి వేధించకూడదని, రాజ్యాంగంలోని అధికరణ 142 క్రింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకుని జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన తీర్పుతో అనేకమంది సెక్స్ వర్కర్లు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో అనేక చోట్ల సంబరాలు జరుపుకున్నారు.
దేశంలో ట్రిబ్యునల్స్ వ్యవస్థను బలోపేతం చేయడంలో జస్టిస్ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. పదేళ్ల ప్రాక్టీసు ఉన్న న్యాయవాదులు ట్రిబ్యునల్స్‌లో జ్యుడిషియల్ సభ్యులుగా అర్హులని ప్రకటించారు. 50 ఏళ్ల వయో పరిమితిని కూడా ఆయన కొట్టివేశారు. క్రిమినల్ విచారణల్లో లోపాల్ని, ఆలస్యాల్ని కూడా ఆయన ఎత్తి చూపారు. ట్రయల్ కేసులను వేగవంతం చేయాలని ఆదేశించారు, హై కోర్టుల్లో దశాబ్దాలుగా క్రిమినల్ అప్పీళ్లు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చెట్లూ అడవి క్రిందకు రావని కేంద్రం చేసిన వాదనను జస్టిస్ నాగేశ్వరరావు తిరస్కరించారు. అటవీ అనుమతులు పొందిన తర్వాతే మెట్రో పనులు చేపట్టాలని ఆయన ఢిల్లీ మెట్రోను ఆదేశించారు. ఎబీఎన్, టీవి5 ఛానెల్స్‌పై రాజద్రోహం కేసులు మోపినప్పుడు చంద్రచూడ్, లావు నాగేశ్వరరావు, రవీంద్ర భట్‌లతో కూడిన బెంచ్ కలుగచేసుకుంది, ఈ ఛానెల్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదు అని స్పష్టం చేసింది. ‘రాజద్రోహ పరిమితులను నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ప్రకటించారు. ‘మేము రాజ్యాంగాన్ని అనుసరించాలి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే మేము కళ్లు మూసుకోలేము, మాకు రాజ్యాంగమే బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానం’ అని ఆయన కేంద్రానికి స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది రాజద్రోహం కాదు’ అని జస్టిస్ నాగేశ్వరరావు అన్నారు.
స్వతంత్ర న్యాయవ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యం పరిఢవిల్లదు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో అన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు సఫలమయ్యాయని చెప్పలేము. కాని ప్రతి దశలోనూ కొందరు న్యాయమూర్తులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించి న్యాయవ్యవస్థ ఉనికిని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అలాంటి న్యాయమూర్తుల్లో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఒకరని నిస్సందేహంగా చెప్పవచ్చు.న్యాయాన్ని గెలిపించిన న్యాయమూర్తిఎ. కృష్ణారావు(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)